మెజార్టీ తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటా - ఉత్తమ్ కుమార్ రెడ్డి
X
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్నగర్లో 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని.. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుందని ఉత్తమ్ అన్నారు. వేపల సింగారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. హుజూర్ నగర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు అవుతాయని చెప్పారు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆయన.. రాహుల్ ప్రధాని కావడం ఖాయమని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలోదని ఉత్తమ్ విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, పేదలకు ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత గాంధీ కుటుంబానిదన్న ఉత్తమ్.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.