హెచ్చరిక.. రానున్న 3 రోజులు తెలంగాణలో కుండపోత వానలు
X
తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్‌అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో రానున్న 3 రోజులపాటు అంటే జూలై 25-27 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మూడు రోజులపాటు కుండపోత వానలు ఉండడంతో అప్రమత్తం చేసింది. మంగళవారం(నేటి) నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షం మొదలవ్వడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ కూడా చేయడం జరిగింది. భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు హడలిపోతున్నారు. మరో మూడు గంటలపాటు ఇలాగే వర్షం కురుస్తుందని.. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.
పనులకు వెళ్లేవాళ్లు వర్షం పరిస్థితులు.. ట్రాఫిక్‌ను అంచనా వేసుకుని బయటకు రావాలని సూచిస్తున్నారు. పాత భవనాల్లో ఉంటున్నవాళ్లు తక్షణమే ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. కరెంట్ పోల్‌ల విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. రోడ్లపై వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్స్‌ను గమనించాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులు చెలరేగే అవకాశం ఉన్నందున.. తాగే నీరు, అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ సైతం సూచిస్తోంది. పలు జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్‌కు కుండపోత ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 దాకా సెలవులు ప్రకటించాలంటూ పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.