Medaram : మరికొన్ని రోజుల్లో మహాజాతర..వనదేవతల దర్శనానికి పోటెతుతున్న భక్తులు
X
తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్దమవుతోంది. మహాజాతరకు టైం దగ్గరపడుతుండడంతో.. అధికారులు రహదారుల మరమ్మతులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అతిపెద్ద గిరిజన జాతర కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దేశ నలుమూల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు వైభవోపేతంగా జరగనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే జాతర ప్రారంభం కాడానికి ఇంకా రెండువారాలే ఉన్నప్పటికీ రోడ్డు మరమ్మత్తులు, ఇతర పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.
అమ్మవార్లకు మొక్కులు చెల్లింపు..
మేడారం మహాజాతరకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఆలయ పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. ములుగు జిల్లాకు వెళ్లే రహాదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈనేపథ్యంలో అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారం బాట పడుతున్నారు. వనదేవతల దర్శనానికి పోటెత్తుతున్నారు. ముందుగా జంపన్న వాగు వద్ద తలనీలాలు సమర్పించి స్నానాలు చేసి అమ్మవార్ల గద్దెల చెంతకు చేరుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మకు పసుపుకుంకుమలతో పూజలు చేసి బంగారం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ముందు గద్దెల లోపలికి భక్తులను అనుమతించగా.. రద్దీ పెరగడంతో బయటి నుంచే దర్శనాలకు అనుమతిస్తున్నారు.
భక్తుల ఇబ్బందులు..
అయితే, మేడారానికి వెళ్లే రోడ్లు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జాతర టైయానికి పనులు పూర్తి కాకపోతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాతర సయయంలో అన్ని దారులు మేడారం వైపే ఉంటాయి కాబట్టి..త్వరగా రహదారి మరమ్మతులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇటు మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రెండేళ్లకోసారి వచ్చే తెలంగాణ కుంభామేళాను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉందని ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.