Singareni Election Polling: మరికాసేపట్లో సింగరేణి ఎన్నికలు ప్రారంభం..
X
ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరికాసేపట్లో సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్‌లలో నిర్వహించే ఎన్నికలకు కేంద్ర కార్మికశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రహస్య బ్యాలెట్ విధానంతో ఓటింగ్ నిర్వహించనున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఆ వెంటే రాత్రి 7 గంటల తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి INTUC, AITUC మధ్యే ప్రధాన పోటీ ఉంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు పోలీసుల చొప్పున కేటాయించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంల్లో కౌంటింగ్ జరుగుతుంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ రెండు రీజియన్లలో భారీగా ఓటర్లు ఉన్నారు. రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా… బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పోలిక్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. బ్యాలెట్ విధానంలో ఉదయం 7 గంటల నుంచి ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహణ ఉంటుందని ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్నవారిని మాత్రమే ఓటింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. రాత్రి 7 గంటలకు ఇల్లందు సింగరేణి కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇల్లందు సీఐ కరుణాకర్ తెలిపారు.