తెలంగాణకు ఐఐహెచ్‌టీ మంజూరు.. ఉత్తర్వులిచ్చిన కేంద్రం
X
తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ విద్యాసంస్థను కేంద్రం మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఐఐహెచ్‌టీతో జౌళీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐహెచ్‌టీతో రాష్ట్ర విద్యార్థులకు కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయన్నారు. తెలంగాణలో చేనేత, జౌళి పరిశ్రమపై ఆధారపడి చాలా మంది బతుకుతున్నారని, వారికి ఈ విద్యాసంస్థ ద్వారా ప్రయోజనం కలుగుతుందన్నారు.
చేనేత సాంకేతిక కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపేందుకు రాష్ట్రంలో కోర్సులు లేవన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదివేవారు చాలా మంది ఉన్నారన్నారు. దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT)కి పేరుగాంచిందని, ఆ కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు.
భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీని నెలకొల్పాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఐఐహెచ్‌టీకి భారీ డిమాండ్ ఉండడంతో తెలంగాణలోనూ ఐఐహెచ్‌టీని నెలకొల్పాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ వచ్చిందని, కేంద్రమంత్రులకు లేఖలు సైతం రాసినట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి ఫలితంగానే ఎట్టకేలకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.