Singareni Recruitment : సింగరేణిలోని పలు నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ
X
సింగరేణిలోని పలు నియామకాల్లో అవకతవకలు జరిగాయి. మెడికల్ ఇన్వ్యాలిడేషన్ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ఉద్యోగులను సింగరేణి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. సింగరేణి ఎండీ బలరాం లేఖతో ఏసీబీ రంగంలోకి దిగింది. మెడికల్ బోర్డులో జరిగే ప్రక్రియపై ఏసీబీ ఆరా తీసింది. అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న కార్మికులను అన్ ఫిట్ చేయిస్తామంటూ దళారులు వారి నుంచి లక్షలు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ అయితే తమ వారసులకు ఉద్యోగం వస్తుందని పలువురు ఉద్యోగులు మెడికల్ బోర్డును ఆశ్రయిస్తున్నారు. దీనిని కొంతమంది దళారులు క్యాష్ చేసుకుని అన్ఫిట్ చేయిస్తామంటూ వారి నుంచి లక్షలు వసూల్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎండీ బలరాం ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏసీబీని కోరారు. ఇప్పటికే ఏసీబీ అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. మెడికల్ ఇన్వ్యాలిడేషన్ దందా నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ఏసీబీని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ మెడికల్ బోర్డుపై ప్రత్యేక నజర్ పెట్టింది. అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేయడంతోపాటు కార్మికుల నుంచి డబ్బులు వసూల్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సింగరేణి తాజా నిర్ణయంతో అర్హులైన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.