Home > తెలంగాణ > MLC Kavita : లిక్కర్ స్కాంలో కవితను అన్యాయంగా ఇరికించారా..?

MLC Kavita : లిక్కర్ స్కాంలో కవితను అన్యాయంగా ఇరికించారా..?

MLC Kavita : లిక్కర్ స్కాంలో కవితను అన్యాయంగా ఇరికించారా..?
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. నిందితులు లంచం తీసుకున్నట్లు రుజువులెక్కడని దర్యాప్తు సంస్థలను కోర్టు నిలదీయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాలసీ మారినంత మాత్రాన అక్రమాలు జరిగినట్లేనా అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న సీబీఐ, ఈడీల దర్యాప్తు తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోందని పలువురు అంటున్నారు. కేసులో నిందితులు, అప్రూవర్లుగా మారినవారి స్టేట్మెంట్ ఆధారంగా సంబంధంలేని వారిని కేసులో ఇరికిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

లిక్కర్ పాలసీ స్కాంలో ప్రధాన పాత్ర పోషించారంటూ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశాయి. దీంతో ఫిబ్రవరి 26నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు ఇప్పటి వరకు ముగ్గురు ఆప్ నేతలతో పాటు పలువురిని అరెస్ట్ చేశాయి. అయితే కేసులో ఏ1గా ఉన్న సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయనపై మోపిన అభియోగాలపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు సరైన సాక్ష్యాలు చూపలేకపోయాయని రుజువులను చూపడంలో విఫలమయ్యాయని అభిప్రాయపడింది. వాట్సాప్ చాట్, నిందితుల అకౌంట్లో డబ్బులు పడ్డాయన్న వాదనల ఆధారంగా తప్పు జరిగినట్లు ఎలా నిర్థారిస్తారని ప్రశ్నించింది. ఒకరి ఖాతాలో డబ్బు పడితే అవి లిక్కర్ స్కాంకు సంబంధించినవేనని అదే సాక్ష్యమని ఎలా చెబుతారని నిలదీసింది.

సుప్రీంకోర్టు చేసిన కామెంట్లు ఏ1 నిందితుడిపై దర్యాప్తు సంస్థలు డొల్ల ఆరోపణలు చేశాయనడానికి నిదర్శనమని పలువురు అంటున్నారు. ఈలెక్కన చూస్తే కేసులో ఎంత మందిపై ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ చేతిలో పావుగా మారిన దర్యాప్తు సంస్థలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి కేసులు పెట్టి ఉంటారని పలువురు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని అంటున్నారు.

లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ, ఈడీలు వందల పేజీలతో అనుబంధ చార్జ్ షీట్లు సైతం దాఖలు చేశాయి. అందులో పలువురు వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకుల పేర్లను చేర్చాయి. లిక్కర్ స్కాంతో సంబంధముందని, సౌత్ గ్రూప్ పేరుతో లావాదేవీలు జరిపారంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును సైతం ఛార్జిషీటులో చేర్చారు. ఈ క్రమంలోనే దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే ఆమెను ప్రశ్నించింది. మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.

నిజానికి లిక్కర్ స్కాంలో అరెస్టైన అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఆధారంగా ఛార్జ్ షీటులో కవిత పేరు చేర్చినట్లు ఈడీ స్వయంగా చెప్పింది. ఇండో స్పిరిట్ కంపెనీ ఓనరైన పిళ్లై.. కవితకు బినామీ అని, ఆమెకు స్కాంతో సంబంధముందని ఆయనే చెప్పారని అందులో ప్రస్తావించింది. అంతే తప్ప ఆరోపణలకు సంబంధించి రుజువులు, సాక్ష్యాల గురించి ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కవితపై చేసిన ఆరోపణలన్నీ కేవలం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా చేసినవేనని తేటతెల్లమవుతోంది.

కవిత బినామీగా ఇండో స్పిరిట్స్‌ కంపెనీ భాగస్వామి అరుణ్‌ పిళ్లై వ్యవహరించారని ఈడీ ఛార్జ్ షీటులో రాసింది. ఆమెకు తెలిసే లావాదేవీలు జరిగాయని చెప్పింది. లిక్కర్ స్కాంలో నగదు లావాదేవీలు జరిగాయని, మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే ఆమె హైదరాబాద్లో ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ ఛార్జ్ షీటులో ఆరోపించారు. కేవలం అరుణ్ పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే కవితపై దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసిందే తప్ప ఎలాంటి బలమైన సాక్ష్యాలు చూపలేదు. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించారు.. మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బులతో కవిత ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారన్న రుజువు మాత్రం ఈడీ చూపలేదు.

నిజానికి ఢిల్లీలోలాగే తెలంగాణలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేవు. మోడీ సర్కారు వైఫల్యాలను సీఎం కేసీఆర్ పదేపదే ఎత్తి చూపుతుండటం వల్లే దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని కవితపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం నిందితులు ఆమె పేరు చెప్పారన్న సాకుతో కవితను లిక్కర్ ఉచ్చులోకి లాగి బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సాక్ష్యాలులేకుండా కేవలం రాజకీయంగా ఇబ్బందికి గురిచేయాలన్న లక్ష్యంతో పెట్టిన కేసులు వీగిపోవడం ఖాయమని, కేంద్ర ప్రభుత్వం పన్నిన లిక్కర్ ఉచ్చు నుంచి తెలంగాణ ఆడబిడ్డ తప్పక బయటపడతారని పలువురు అంటున్నారు.




Updated : 5 Oct 2023 3:43 PM GMT
Tags:    
Next Story
Share it
Top