తెలంగాణ నుంచి పీఎం మోడీ పోటీ?
X
తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని ఇవాళ గాంధీభవన్ లో జరిగిన పీఏసీలో టీపీసీసీ తీర్మానం చేసింది. తాజాగా ప్రధాని మోడీ కూడా తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలువనున్నారనే ప్రచారం జరుగుతోంది. పీఎం మోడీని రాష్ట్రంలో పోటీ చేసేలా బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణలో పోటీ చేస్తే తమ పార్టీకి మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయని, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ పోటీ చేస్తే ఆయన స్థానంతో పాటు మరికొన్ని సీట్లు గ్యారెంటీగా గెలువచ్చని బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి మోడీ సంసిద్ధత వ్యక్తం చేస్తే తన స్థానాన్ని (సికింద్రాబాద్) వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మోడీ కోసం తమ స్థానాలను కూడా త్యాగం చేస్తామంటూ రాష్ట్రానికి చెందిన మిగతా బీజేపీ ఎంపీలు అంటున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.