కమలాన్ని వీడి హస్తం గూటికి విజయశాంతి!
X
బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి.. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. రేపు తెలంగాణకు న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు రానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రాములమ్మ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ తలపెట్టిన కుత్బుల్లాపూర్ సభలో ఖర్గే పాల్గొంటారని... ఆ సభలోనే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే విజయశాంతి తమ పార్టీలో చేరతారని సీనియర్ నేత మల్లు రవి ఇటీవల ప్రకటించారు. అయితే విజయశాంతికి కాంగ్రెస్ మెదక్ లోక్ సభ టికెట్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ తీరుపై గాలి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెదక్ లోక్ సభ టికెట్ కేటాయిస్తామని అనిల్ కు పార్టీ అధిష్టానం గతంలో హామీ ఇచ్చింది. అయితే విజయశాంతి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో... తాజాగా ఆ టికెట్ ను ఆమెకు ఇస్తామని చెప్పారట. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన అనిల్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా.. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. పలు సమయాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభిమానం కూడా చూపించిన విషయం తెలిసిందే.