బాధ్యతలు చేపట్టిన రోజే అధికారులకు ఐటీ మినిస్టర్ వార్నింగ్
X
ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా తన సీట్లు కూర్చున్నారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం సంబంధిత ఫైల్‌పై సంతకాలు చేశారు. ఆ తర్వాత అధికారులతో సమావేశమై తొలి సమావేశంలోనే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేలా లీకులు ఇస్తే మాత్రం సహించేది లేదని చెప్పేశారు.
ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి తరలి పోతున్నాయని దుష్పచారం చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదని ఐటీ సెక్రటరీ, అధికారులను మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా హైదరాబాద్ లో స్థాపించాలని భావించిన కార్నింగ్ సంస్థ తన ప్లాంట్ ను తెలంగాణలో కాకుండా చెన్నైకి తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తమిళనాడులో ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ మెరుగ్గా ఉండటంతోపాటు.. ఇతర ఆపిల్ సప్లయర్లు కూడా చేరువగా ఉంటారనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు కథనంలో పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్లే కార్నింగ్ సంస్థ పొరుగు రాష్ట్రాన్ని ఎంచుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి అధికారులను హెచ్చరించారు.