Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లన్నకు ఐటీ నోటీసులు.. రూ.8 కోట్లు కట్టాలని..
X
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 8కోట్ల ఇన్కం ట్యాక్స్ కట్టాలని అందులో తెలిపారు. అంతేకాకుండా సకాలంలో పన్ను కట్టకపోవడంతో మరో 3కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. బాసర సరస్వతీ ఆలయం, వేములవాడ రాజన్న ఆలయాలకు సైతం ఐటీ నోటీసులు అందినట్లు సమాచారం.
2016 -17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని ఐటీ శాఖ మల్లన్న ఆలయానికి నోటీసులు జారీ చేసింది. ఐటీ చట్టం 147 కింద రూ.8,64,49,041 పన్ను చెల్లించాల్సి ఉందని, దీన్ని సకాలంలో చెల్లించనందుకు ఐటీ చట్టంలోని సెక్షన్ 271 (1) సీ ప్రకారం రూ.3,49,71,341, ఐటీ చట్టంలోని సెక్షన్ 271(1) డీ ప్రకారం మరో రూ.20వేలు, ఐటీ చట్టం 271 (ఎఫ్) కింద మరో రూ.5 వేలు జరిమానాలుగా చెల్లించాలని స్పష్టం చేసింది. మొత్తంగా రూ.12 కోట్లకుపైగా సొమ్మును తక్షణం చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.
మల్లన్న ఆలయానికి ఐటీ నోటీసులపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. హిందూ ధర్మ పరిరక్షకులమని చెప్పుకునే బీజేపీ ఆలయాలకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. కానీ బీజేపీ నేతలది దేవుళ్లపై కపట ప్రేమ అని ఆరోపించింది. ఐటీ నోటీసులపై అటు భక్తులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆలయానికి ఐటీ నోటీసులు ఇవ్వడమేంటని అడుగుతున్నారు.