వరుసగా రెండో రోజూ... బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు
అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, నివాసంలో రెండో రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మెయిన్ లాండ్ డిజిటల్ టెక్నాలజీలో ముగ్గురు నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నిన్న రాత్రి 10 గంటల వరకు పైళ్ల కుటుంబ సభ్యుల వద్ద పలు కంపెనీలు లావాదేవీల వివరాలను సేకరించారు. మోహన్ రెడ్డి నివాసంలో లభించిన కీలక డాక్యుమెంట్ లపై పైళ్ల వద్ద వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ముగ్గురు నేతలు పన్నులు ఎగ్గొట్టారన్నది ఐటీ అధికారుల ప్రధాన అభియోగం. ఈ ముగ్గురి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలే ఐటీ దాడులకు కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని మెయిన్‌ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. సరిగ్గా అదే కంపెనీలో మరో డైరెక్టర్‌గా కొత్త ప్రభాకర్‌రెడ్డి భార్య మంజులత కూడా ఉండటంతో ఒకరి తర్వాత మరొకరిపై ఈ దాడులు చేస్తున్నారు. మెయిన్‌ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీ పెద్దఎత్తున పన్నులు కట్టలేదన్నదే ఇక్కడ ప్రధాన ఆరోపణ.
జేసీ బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమీర్‌పేట్‌లో కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో పలు వ్యాపారాలు మర్రి జనార్థన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. మర్రికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో సైతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్లగా ఉన్న కంపెనీలపై ఐటీ ఫోకస్ పెట్టింది. ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది. బ్యాంకు లాకర్స్‌ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు.. కీలకపత్రాలు, సమాచారం సేకరించారు.బుధవారం ఒకేరోజు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ టార్గెట్ చేయడం రాజకీయ రచ్చకు కారణంగా మారింది.