ఆ పార్టీ నేత ఇళ్లపై ఐటీ రైడ్స్ కలకలం
X
హైదరాబాద్ ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎల్బీనగర్ బ్యాంక్ కాలనీలోని ప్రముఖ వ్యాపారవేత్త ప్రతివా రెడ్డి ఇంట్లో, గచ్చిబౌలిలోని ఆయన బంధువుల ఇంట్లో ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ నేత అందెల శ్రీరాములు నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున మహేశ్వరం నుంచి శ్రీరాములు పోటీ చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 26 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీరాములు పర్సనల్ అసిస్టెంట్ నివాసంతో పాటు శ్రీరాములు బిజినెస్ పార్ట్ నర్ ప్రతిమా రెడ్డి ఇంట్లో కూడా ఐటీ రైడ్ జరుగుతోంది. పోలీస్ సిబ్బంది సాయంతో వారి ఇళ్లకు చేరుకున్న ఐటీ అధికారులు.. ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ఐటీ అధికారుల ఆకస్మిక తనిఖీలకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.