వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు.. కవిత చొరవతో వీగిన అవిశ్వాసం
X
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ సెగ తగిలింది. జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై తీర్మానించిన కౌన్సిలర్ల అవిశ్వాసం వీగిపోయింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ కవిత జోక్యం చేసుకోవడంతో సభ్యుల మధ్య ఉన్న అంతర్గత వివాదానికి తెరపడింది. బుధవారం (ఫిబ్రవరి 14) జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో బలపరీక్ష జరగలేదు. గతేడాది జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మున్సినల్ వైస్ చైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే గోలి శ్రీనివాస్ ను ఇన్ చార్జీగా తొలిగించాలంటూ.. జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ నివేదించారు. ఈ సమయంలో ఆయనపై అవిశ్వాసం పెడుతూ దాదాపు 30 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.
ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై సమావేశం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కవిత.. రంగంలోకి దిగగి వారి సమస్యను తీర్చారు. వారి మధ్య సయోధ్యను కుదిర్చారు. పార్టీ అధిష్టానం అందరికీ అవకాశం కల్పిస్తుందని, భవిష్యత్తులో అవకాశాలు తప్పక వస్తాయని భరోసానిచ్చారు. కవిత సూచన మేరకు కౌన్సిలర్లు వెనుదిరిగారు. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లతో పాటు మరో ఇద్దరు ఇండిపెండ్లు మాత్రమే హాజరయ్యారు. మిగతా బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది.