Jai Mahabharat Party: మొత్తం 119 స్థానాల్లో మహిళలే పోటీ.. పార్టీ అధ్యక్షుడి కీలక ప్రకటన
X
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులపై బలమైన మహిళా అభ్యర్థులను నిలబెట్టి.. వారిని చిత్తుగా ఓడిస్తామని సంచలన ప్రకటన చేసింది ఓ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నట్లు జై మహా భారత్ పార్టీ (Jai Maha Bharat Party) ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ సైఫాబాద్‌లోని కార్యాలయంలో .. పార్టీ జాతీయ అధ్యక్షుడు భగవాన్ అనంతవిష్ణు ప్రభు ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రులపై బలమైన మహిళా అభ్యర్థులను నిలబెట్టి వారిని ఓడిస్తామని అనంతవిష్ణు ప్రభు చెప్పారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 1న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 50,000 మందితో మహిళా గర్జన నిర్వహిచనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తామని.. భూలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 200 గజాల స్థలాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని అనంతవిష్ణు ప్రభు వెల్లడించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.32,000 విలువ చేసే సోలార్ స్టవ్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్‌ను నిషేధించి.. ప్రతి ఇంటికి రూ.50కే బయో గ్యాస్ (గోబర్ గ్యాస్) సిలిండర్, వంటింటికి సరిపడా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించి ప్రజల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీ 100 శాతం సీట్లు మహిళలకు టికెట్లు కేటాయించలేదని.. జై మహా భారత్ పార్టీ ఆడవారికి పెద్ద పీట వేస్తుందని అనంతవిష్ణు ప్రభు స్పష్టం చేశారు.