Jalagam Venkatrao : కారు దిగనున్న జలగం.. పోటీ ఎక్కడి నుంచంటే..
X
బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. క్యాడర్తో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు ఆ సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన మరో నేత జలగం వెంకట్రావు సైతం కాంగ్రెస్తో చేయి కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల అనుచరులతో భేటీ అయిన ఆయన సెప్టెంబర్ తొలి లేదా రెండోవారంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈసారి బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని ప్రకటించిన హైకోర్టు రెండోస్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. వనమాపై అనర్హత వేటు పడటంతో ఈసారి కొత్తగూడం టికెట్ పక్కా అని భావించారు. అయితే హైకోర్టు తీర్పును వనమా సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది.
హైకోర్టు అనర్హత వేటు, వనమా కుటుంబంపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఈసారి ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ కేసీఆర్ కొత్తగూడెం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాకే కేటాయించారు. దీంతో ఆ టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావు అనుచరులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తుమ్మలతో పాటు గానీ లేదా సెప్టెంబర్ రెండోవారంలో గానీ జలగం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈసారి ఆయనను కాంగ్రెస్ తరఫున కూకట్పల్లి నుంచి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.