జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కంటతడి
X
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.శనివారం మీడియాతో ముత్తిరెడ్డి మాట్లాడుతూ తన కూతురు, అల్లుడు తనను ఇబ్బందులు గురి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎదుర్కోలేక దమ్ములేక కొంతమంది దృష్టులు తన కూతురిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు సమాజానికి మంచిది కాదని, వారికి అరిష్టం కలుగుతుందని ముత్తిరెడ్డి శపించారు. ప్రజాసేవతో ప్రజల మనసులు గెలుచుకోవాలి తప్ప... ఇలాంటి అడ్డమైన పనులు చేయకూడదని హెచ్చరించారు.రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అలాంటి నా బిడ్డను మీస్ గైడ్ చేసి రోడుపై వేస్తున్నారని మండిపడ్డారు. తన కూతురు ప్రజలకు స్థలాన్ని దానం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.
కొంత కాలంగా ముత్తిరెడ్డికి ఆయన కూతురికి మధ్య భూ వివాదం నడుస్తోంది. చేర్యాల పట్టణంలో తన పేరుమీదున్న 23 గుంటల భూమిని తన తండ్రి కబ్జా చేసి తనకు తెలియకుండా తన పేరు మీద రిజిస్టర్ చేయించారంటూ ఆమె ఆరోపిస్తోంది. ఇటీవల జనగామలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఈ విషయంపై భవానీ అందరిముందే బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన భూమిని ఆమె తిరికి మున్సిపాలిటీకి అప్పగించింది.
హైకోర్టు నోటీసులు
కూతురు, అల్లుడ వ్యవహారంపై తాజాగా ముత్తిరెడ్డి హైకోర్టు మెట్లు ఎక్కారు. కూతురు, అల్లుడు తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 22న ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దాంతో కోర్టుని ఆశ్రయించినట్లు చెప్పారు. దీనినిపై విచారణ జరిపిన న్యాయస్థానం ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి, అల్లుడు పి రాహుల్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అదే విధంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారణను జులై 25కి వాయిదా వేసింది.