తెలంగాణ ఎన్నికల ఓటింగ్పై పవన్ సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణ ఎన్నికలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో అత్యల్ప ఓటింగ్ నమోదు కావడం బాధ కలిగించిందన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జనసేన కండువా కప్పుకుని ప్రచారం చేయడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను పెద్దగా పర్యటనలు చేయకపోయినా.. తన భావజాలం నచ్చి యువత జనసేన వెంట నిలిచారన్నారు. జనసేన అనేది వ్యక్తుల పార్టీ కాదు.. భావజాలంతో నడిచే పార్టీ అని చెప్పారు. మాజీ సీఎం కూతురు, సీఎం సోదరిగా ఉన్న వ్యక్తి తెలంగాణ ఎన్నికల బరిలో నిలవలేరని.. కానీ యువత ఆదరణ చూసి జనసేన 8స్థానాల్లో పోటీ చేసిందని తెలిపారు.
ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని.. తమ పార్టీకి యువతే పెద్ద బలమని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేనకు యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని చెప్పారు. కార్యకర్తల చిత్తశుద్ధితో ఢిల్లీలోనూ జనసేనకు గుర్తింపు వచ్చిందన్నారు. కానీ వైసీపీకి ఎటువంటి భావజాలం లేదన్న పవన్.. ఎందుకోసం పనిచేస్తున్నారో ఆ పార్టీ వారికే తెలియదని విమర్శించారు. కానీ తాను ఏం చేసినా ప్రజల కోసమే చేస్తానని చెప్పారు. నా సినిమాలు ఆపేసినా, నేను బసచేసిన హోటల్‌కు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా ఢిల్లీ నాయకుల దగ్గరకు వెళ్లి సాయం అడగలేదని చెప్పారు. ‘‘ఎందుకంటే ఇది మన నేల.. మన పోరాటం. మనం వారికి బలం అవ్వాలి కానీ మనం బలం చూపించకపోతే వాళ్లు గుర్తింపు ఇవ్వరు. పోరాటం చేసే వాళ్లనే వారు గుర్తిస్తారు. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది’’ అని పవన్ అన్నారు.