Jitta Balakrishna: బీఆర్ఎస్లోకి జిట్టా.. కేటీఆర్, హరీష్ రావులతో భేటీ
X
తెలంగాణలో నేతల జంపింగ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీల్లోకి.. విపక్షాల నుంచి బీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఇవాళ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో జిట్టా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అతిత్వరలోనే తన అనుచరులతో కలిసి కారెక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జిట్టా బాలకృష్ణారెడ్డి 2009 వరకు టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన యాక్టీవ్గా పని చేశారు. అయితే 2009లో భువనగిరి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పుడు ఇండిపెండెంట్గా భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. దాదాపు ఏడాది క్రితం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అయితే ఇటీవల ఆ పార్టీ అధినాయకత్వం తీరును విబేధించడంతో ఆయన్ను కమలం పార్టీ సస్పెండ్ చేసింది.
బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యాక జిట్టా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే జిట్టా కాంగ్రెస్లోకి చేరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించడం.. ఆయనకే టికెట్ అన్నట్లుగా సంకేతాలు ఇవ్వడంతో బాలకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరనున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి.