Jitta Balakrishna Beddy: 14 ఏండ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి జిట్టా బాలక్రిష్ణారెడ్డి
X
తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న భువనగిరి నియోజకవర్గానికి చెందిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి.. నేడు తిరిగి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరనున్నారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జిట్టా.. ఆ పార్టీ నుంచి భువనగిరి టికెట్ ఆశించారు. ఇక కాంగ్రెస్ టికెట్ కూడా రాదని తేలిపోవడంతో.. మళ్లీ బీఆర్‌ఎస్‌లోనే చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులతో చర్చలు జరిపారు జిట్టా. పార్టీలోకి వారు ఆహ్వానించడంతో శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్ కండువా వేసుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో జిట్టా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కానీ, నవంబరులో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయడం ఇక దాదాపు లేనట్టే.
జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉద్యమంలో ముందుండి పనిచేసి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడయ్యారు. కానీ, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ దక్కలేదు. టీడీపీతో పొత్తులో బాగంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ టీడీపీకి కేటాయించడంతో ఉమామాధవరెడ్డి పోటీ చేశారు. తనకు టికెట్ రాకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేశారు. అలా 2009, 2014, 2018 శాసన సభ ఎన్నికల్లో వరసగా ఇండిపెండెంటుగానే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుని హోదాలో జిట్టా బాలకృష్ణారెడ్డి 2022 ఫిబ్రవరిలో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పార్టీని డిమాండ్ చేయడంతో జిట్టాపై క్రమశిక్షణా చర్యల కింద బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.
బీజేపీ నుంచి సస్పెన్షన్ గురయ్యాక ఆయన కాంగ్రెస్ లో చేరారు. భువనగిరి నుంచి ఈ సారి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయాలని భావించారు. అసెంబ్లీ టికెట్ కోసం పార్టీ పెద్దల నుంచి కూడా ఆశీస్సులు పొందారు. అయితే అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తిరిగి పార్టీలోకి రావడంతో బాలకృష్ణారెడ్డి సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు తనను నమ్మించి మోసం చేశారన్న భావనకు వచ్చిన జిట్టా... మళ్లీ 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరబోతున్నారు.