KA Paul: మా పార్టీ మేనిఫెస్టోను BRS కాపీ కొట్టింది
X
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. తమ పార్టీ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ వాళ్లు కాపీ కొట్టారని ఆరోపించిన ఆయన... బీఆర్ఎస్ మేనిఫెస్టో అంతా బూటకమన్నారు. కేసీఆర్ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలను చేస్తున్నారని ఆరోపించారు. తెలివైనవాడు ఎవడూ.. కేసీఆర్కు ఓటెయ్యడన్నారు.
ఆదివారం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేనిఫెస్టోపై కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని చెప్పారు. సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని కేఏ పాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దుయబట్టారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, దళితబంధు, నిరుద్యోగులకు ఉద్యోగాల హామీని నేరవేర్చలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కి సీట్లు తక్కువగా వస్తే కాంగ్రెస్ ను కలుపుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీ పాలనను వెలివేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించాలని, తన ప్రజాశాంతి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తానని కేఏ పాల్ తెలిపారు. జనాల దగ్గరి నుంచి దోచుకున్న సొమ్మును తీసుకుని మళ్లీ ఎన్నికల వేళ నేతలు జనాలకు పంచుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ మతతత్వపార్టీ అని ఆరోపించారు. బడుగ వర్గాల వారికే ప్రజాశాంతి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని.. తెలంగాణను రక్షించుకోవడానికి ఇది చివరి అవకాశమని చెప్పుకొచ్చారు.