Praja Shanthi Party: 10వేలు పంపి పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోండి : పాల్
X
కాంగ్రెస్లోని తన కోవర్టులను గెలపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేఏ పాల్ అన్నారు. బీఆర్ఎస్కు వాళ్లతో రాజీనామా చేయించి కాంగ్రెస్లో చేర్పించి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పాలన సాగుతోందని.. ఈ పాలనను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు.
60శాతం ఉన్న బీసీలకు 60 సీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. పోటీ చేయాలనుకున్న వారు వారం రోజుల్లోగా రూ.10 వేలు గూగుల్‌పే చేసి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీకి సిద్ధమంటూ ఇప్పటివరకు 3600 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ను మించిన పథకాలను అమలుచేస్తామన్నారు.
పాలకులుగా దోపిడి దొంగలు ఉండాలా..? తాను ఉండాలా అనేది ప్రజలు తేల్చుకోవాలని పాల్ చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలంటే తమ పార్టీని గెలిపించాలని కోరారు. జగన్ చేసిన తప్పులను షర్మిల చేయొద్దన్నారు. ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేయొద్దని సూచించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏపీలో ఎన్నో ఉద్యమాలు చేశానని.. తెలంగాణలోనూ మంచి పాలన అందిస్తామని చెప్పారు.