KU లో ర్యాగింగ్ కలకలం.. 81 మంది అమ్మాయిల సస్పెండ్
X
యూనివర్శిటీలు, కాలేజీల్లో ర్యాంగింగ్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరు విద్యార్థులు మాత్రం మారడం లేదు. కొత్తగా చేరిన జూనియర్లను సీనియర్లు వేధించడం పరిపాటిగా మారిపోయింది. ర్యాంగింగ్ కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, సీనియర్లు పట్టించుకోవడం లేదు. జూనియర్లను ర్యాగింగ్ పేరుతో ఏడిపిస్తున్నారు. తాజాగా వరంగల్ (Warangal )లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో సీనియర్లు... నూతన పరిచయాల పేరుతో జూనియర్లను వేధించారు.
పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు... జూనియర్లపై ర్యాంగింగ్‌కు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పద్మావతి ఉమెన్స్ హాస్టల్‌లో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినుల వివరాలు సేకరించి, 81 మందిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన విద్యార్థినులు ఉన్నారు. ఈ అమ్మాయిలందరినీ వారం రోజులు పాటు సస్పెండ్ చేస్తూ హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ చర్యలు తీసుకున్నారు. మిగతా విభాగాల్లోనూ ర్యాగింగ్‌కు పాల్పడిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు వర్సిటీ అధికారులు. ఆధారాలు లభిస్తే ర్యాగింగ్ చేస్తున్న వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇక శనివారం నుంచి డిసెంబర్ 31 వరకు క్రిస్మస్ సెలవులు ప్రకటించిన అధికారులు, విద్యార్థులు వెంటనే హాస్టల్స్‌ను ఖాళీ చేయాలని తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులందరి హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడం తొలిసారి. కాగా ఇప్పటి వరకూ ర్యాగింగ్ విషయాల్లో అబ్బాయిలు ఉండే వారు. కానీ, ఇప్పుడు ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో అమ్మాయిల పేర్లు రావడం చర్చనీయాంశంగా మారింది. భారీ సంఖ్యలో విద్యార్థినులను సస్పెండ్ చేయడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.