'సిగ్గుండాలి.. రూ.250 కోట్లు పెట్టి ఓ డైలీ సీరియల్ తీశావ్.. '
X
విషయం ఏదైనా సరే.. ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ కు అలవాటు. తన ముక్కుసూటి తనంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ పై నటి కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ మూవీవీని విమర్శిస్తూ ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు. రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ మువీ జులై 28న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా వెనుకబడింది. ఫస్ట్ డే రూ. 11 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ క్రమంలో కంగనా రనౌత్ కరణ్ జోహార్ మీద ఫైర్ అయ్యారు.
కరణ్‌ని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్టులో...
ప్రేక్షకులను ఇక మోసం చెయ్యలేరు. ఇలాంటి ఫేక్ సెట్స్, ఫేక్ కాస్ట్యూమ్స్‌తో తీసిన సినిమాలను జనాలు అంగీకరించరు. నిజ జీవితంలో ఇలాంటి దుస్తులు ఎవరైనా ధరిస్తారా? 90ల్లో తాను తీసిన సినిమాలనే కాపీ కొట్టినందుకు కరణ్ సిగ్గుపడాలి. పైగా 3 గంటల డైలీ సీరియల్‌కు రూ.250 కోట్లు ఖర్చుపెట్టాడు. టాలెంట్ ఉన్నవాళ్లకు బడ్జెడ్ దొరక్క ఇబ్బందిపడుతుంటే నీకు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు?ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బును వృధా చేయడం అంతమంచిపని కాదు. ఇకనైనా డైరెక్షన్ చేయడం ఆపేయ్. నువ్వు రిటైర్ అయిపో.. టాలెంట్ ఉన్న కొత్త నిర్మాతలకు అవకాశం ఇవ్వు అంటూ కోరారు.
వాళ్లను చూసి నేర్చుకో
అలాగే రణ్‌వీర్‌కు డ్రెస్సింగ్ సెన్స్‌పై కంగనా కొన్ని సూచనలు చేశారు. ‘రణ్‌వీర్ నీకు నేనిచ్చే సలహా ఒక్కటే డ్రెస్సింగ్ విషయంలో దయచేసి కరణ్‌ను ఫాలో అవ్వొద్దు. సాధారణ వ్యక్తుల మాదిరిగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి ప్రయత్నించు. దక్షిణాది హీరోలు ఎంత హుందాగా దుస్తులు ధరిస్తారో చూసి నేర్చుకో. వారెప్పటికీ మన దేశ సంస్కృతిని నాశనం చెయ్యరంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.