Home > తెలంగాణ > బండి సంజయ్ ఆఫీసుపై దాడి.. సీపీ ఏమన్నారంటే..?

బండి సంజయ్ ఆఫీసుపై దాడి.. సీపీ ఏమన్నారంటే..?

బండి సంజయ్ ఆఫీసుపై దాడి.. సీపీ ఏమన్నారంటే..?
X

కరీంనగర్లో బండి సంజయ్ కార్యాలయంపై ముస్లీం యువకులు దాడి చేశారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ అంశంపై విచారణ చేపట్టినట్లు కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా మర్కజీ మిలాద్ కమిటీ ర్యాలీకి అనుమతి కోరిందని.. దానికి పరిమితులతో కూడిన పర్మిషన్ ఇచ్చినట్లు సీపీ చెప్పారు. అయితే కొందరు యువకులు పోలీస్ శాఖ ఇచ్చిన రూట్ మ్యాప్లో కాకుండా రూల్స్ అతిక్రమించి కరీంనగర్ పట్టణంలోని పలు వీధుల్లో ర్యాలీగా తిరిగారన్నారు. అందులో భాగంగానే ఎంపీ బండి సంజయ్ ఆఫీస్ వీధిలో కూడా ర్యాలీగా వెళ్ళారని.. అయితే వారు ఎటువంటి దాడి చేయలేదని స్పష్టం చేశారు.

బీజేపీ నేతల ఫిర్యాదుతో తక్షణమే స్పందించి విచారణ చేపట్టామని సీపీ తెలిపారు. ‘‘ సంఘటన ప్రదేశంలో ఉన్న ప్రత్యక్షసాక్షులని, సీసీ కెమెరాలను కూడా పరిశీలించాం. ముస్లిం యువకులు దాడి చేసినట్లుగా విచారణలో ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇచ్చిన రూట్ మ్యాప్ లో కాకుండా రూల్స్ క్రాస్ చేసిన 15మంది యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశాం. సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు వెళ్లారు. బాధ్యులని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపినా బీజేపీ శ్రేణులు వినకుండా కట్టెలు తీసుకుని రోడ్లపైకి వచ్చి ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించారు. వారిపై కూడా కేసులు నమోదు చేశాం’’ అని సీపీ చెప్పారు.

కరీంనగర్ లోని అన్ని మతాలకు చెందిన ప్రజలు వారి వారి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని పలుమార్లు సూచించామన్నారు. దీనికనుగుణంగానే కరీంనగర్ ప్రజలంతా అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నారన్నారు. ఏవైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.


Updated : 30 Sep 2023 1:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top