కేసీఆర్ కీలక నిర్ణయం.. మరో 8 మెడికల్ కాలేజీలకు పరిపాలనా అనుమతులు..
X
రాష్ట్రంలో ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా మిగిలిన 8 జిల్లాల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళాశాలల నిర్మాణానికి రూ. రూ. 1,447 కోట్లు ఖర్చు చేయనుంది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, ల్యాబ్స్, సెమినార్ హాల్స్, అనుబంధ ఆసుపత్రి , హాస్టల్ భవనాల నిర్మాణంతో పాటు ఇతర వసతులను ఈ నిధులు ఉపయోగించనున్నారు.
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు రూ. 1447 కోట్ల అంచనా ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధుల్లో గద్వాల్, నర్సంపేట్ (వరంగల్), యాదాద్రిలో నిర్మించే కాలేజీలకు రూ. 183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీకి రూ.182 కోట్లు, నారాయణ్ పేట్, ములుగు, మెదక్‌లోలో నిర్మించనున్న కాలేజీలకు రూ. 180 కోట్ల చొప్పున, మహేశ్వరం మెడికల్ కాలేజీకి రూ.176 కోట్ల మేర ప్రభుత్వం నిధులు కేటాయించింది.
2014 వరకు తెలంగాణలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అయితే స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టాక జిల్లాకో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరింది. వచ్చే ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా మంజూరు చేయడంతో వాటి సంఖ్య 34కు చేరనుంది.