KCR: కొత్త ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి.. ట్రాప్ లో పడొద్దు..
X
సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటే ముందే పార్టీకి సమాచారమివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్.. "కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీలను ఇంతవరకూ అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకూ ఇచ్చిన హామీల అమలును సాగదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిద్దాం. లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడుదాం. అందరితో చర్చించాకే మంచి అభ్యర్థులను ప్రకటిస్తా. పార్లమెంట్ ఎన్నికల్లో 6 నుంచి 8 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది" అని అన్నారు. బీఆర్ఎస్ ను బొందపెడతామని కామెంట్లు చేస్తున్న కాంగ్రెస్ ను ప్రజలందరూ గమనిస్తున్నారని కేసీఆర్ అన్నారు. కొత్త ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని, ఏదో చెబితే విని ట్రాప్ లో పడొద్దని సూచించారు.
ఇక ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో కేసీఆర్తో ప్రమాణం చేయించారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. అనారోగ్య కారణంగా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. తాజాగా ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ తన ఛాంబర్కు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.