పొలిటికల్ హీట్ పెంచిన బీఆర్ఎస్.. ఫస్ట్ లిస్ట్ రెడీ చేసిన సీఎం కేసీఆర్...!
X
అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో తెలంగాణలో అన్ని పార్టీలు జోరు పెంచాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్తో పాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. అయితే విపక్షాల కన్నా ఒక అడుగు ముందుండాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఎలక్షన్ హీట్ మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఫైనల్ చేసిన ఆయన త్వరలోనే జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
హ్యాట్రిక్ విక్టరీ టార్గెట్గా పెట్టుకున్న బీఆర్ఎస్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా వచ్చిన సర్వే రిపోర్టులపై చర్చించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్లు ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ కసరత్తు దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాను చేయించిన సర్వే నివేదికల ఆధారంగా కొందరు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎలాంటి వివాదాలు లేని స్థానాల్లో బరిలో దింపే అభ్యర్థులను లిస్టు రెడీ చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో 70 నుంచి 80 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయని ఆషాడ మాసం పూర్తైన తర్వాత ఓ మంచి రోజు చూసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల్ జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్టులో బీఆర్ఎస్ గన్ షాట్గా గెలిచే స్థానాల అభ్యర్థుల పేర్లు ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.