నా నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చింది :కేసీఆర్
X
ఉద్యమంలో విద్యార్థుల ఆత్మబలిదానాలు నన్ను తీవ్రంగా కలచివేశాయన్నారు సీఎం కేసీఆర్. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మారకం, అమర జ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అమరవీరులపై రూపొందించిన ప్రదర్శనను మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి తిలకించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య కుటుంబ సభ్యులను సీఎం, మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఉద్యమం నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.
"తెలంగాణ రాష్ట్ర ఉద్యమప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. రాష్ట్ర ఉద్రమ చరిత్ర చాలా పెద్దది. 1966లో ఖమ్మం నుంచి మొదలైన ఉద్యమం తర్వాత యూనివర్సిటీలకు చేరింది. నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎంతో గొప్పగా పనిచేశారు. పిడికెడు మందితో మేము 5-6 వేల గంటలు మేధమధనం చేశాం. అనేక మందిని సంప్రదించి వ్యూహంతో బయలుదేరాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆ జన్మ తెలంగాణ వాది. ఆయన మార్గదర్శనంలోనే నడిచాం.జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కాపాడుకొంటూ వచ్చారు. ఉద్యమం కోసం చాలా మందిని ఒప్పిస్తూ ముందుకు సాగాం. ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కేలేదు. నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరి మీద జరిగి ఉండదు. ఆ తిట్లే దీవెనలని భావించి ముందుకు సాగాం. 14F నిబంధనకు వ్యతిరేకిస్తూ నేను అమరణ దీక్షకు దిగాను. కేసీఆర్ సచ్చుడో , తెలంగాణ వచ్చుడో అని దీక్షకు చేపట్టాను. కోమాలోకి వెళ్తే బతుకవు అని నిమ్స్ లో డాక్టర్లు బెదిరించారు. నా నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయి. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారు" అని కేసీఆర్ తెలిపారు.