గ్రూప్ -2 పరీక్షలపై హైకోర్టులో విచారణ. ఆ రోజే కీలక నిర్ణయం
X
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం కీలక విచారణ జరిగింది. గ్రూప్ 2 పరీక్షల నిర్వాహణపై నిర్ణయాన్ని తెలపాలని సంబంధిత న్యాయవాదిని ఆదేశించింది. తమ నిర్ణయం ఏమిటో సోమవారం తెలుపుతామని టీఎస్పీఎస్సీ న్యాయవాది తెలిపారు. అయితే ఆరోజు కచ్చితంగా తెలియజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
కొన్ని నెలల క్రితమే టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల తేదిని ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1539 సెంటర్లలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో కొంతమంది గ్రూప్ 2ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.వరుసగా పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2ని రీ షెడ్యూల్ చేయాలని 150 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురుకుల, గ్రూప్-2 సిలబస్ వేర్వేరు కావటంతో రెండింటిలో ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంటుందని అభ్యర్థులు వాపోతున్నారు.