Amrapali kata: తిరిగి రాష్ట్రానికి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి
X
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌లో ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇటీవల కేంద్ర సర్వీసులో డిప్యూటేషన్ పూర్తి కావడంతో తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు ఈ డైనమిక్ ఆఫీసర్. ఈ క్రమంలోనే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారామె. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడే డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ డిప్యూటేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్టు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అమ్రపాలికి తమ ప్రభుత్వంలో సమున్నత స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఆమ్రపాలి వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా పనిచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ ఆమె పనిచేశారు. తాను పనిచేసిన వివిధ హోదాల్లో ఆమె తన ముద్రను వేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2018, ఫిబ్రవరిలో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను ఆమ్రపాలి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా నుంచి పెళ్లికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త దంపతులను ఆశీర్వదించారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.