Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు కన్జ్యూమర్ ఫోరం షాక్
X
హైదరాబాద్ మెట్రో సంస్థకు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.10 వేల జరిమానా విధించడం చర్చనీయాశంగా మారింది. నాలుగేళ్ల క్రితం ఓ ప్రయాణికుడి నుంచి రూ. 10 లు అదనంగా వసూలు చేసి... ఫలితంగా ఇప్పుడు రూ.10 వేలు సమర్పించుకోవాల్సి వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన లాయర్ వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ 2019 జనవరి 18న మెట్రోలో ప్రయాణించేందుకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లారు. మెట్రో రైలు ఎక్కే తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేవు దాంతో ఆయన మరో వైపు ఉన్న వేరే దారిలో టాయిలెట్‌కు వెళ్లారు. అందుకోసం మెట్రో రైల్వే సంస్థ జారీ చేసిన ట్రావెల్ కార్డును ఆయన స్టేషన్‌లో స్వైప్ చేశారు. అయితే.. అదే స్టేషన్‌లో ఓ పైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు రూ.10 ట్రావెల్ కార్డ్ నుంచి కట్ కావటంతో ఆయన సిబ్బందిని నిలదీశాడు. తాను ట్రావెల్ చేయకుండా డబ్బులు ఎలా కట్ అవుతాయని అడిగాడు. దానికి మెట్రో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు.
రోజు వేలాదిమందికి ఇలాగే జరుగుతుందని గమనించిన నరేంద్ర స్వరూప్.. ఖమ్మంలోని వినియోగదారుల కమిషన్ లో దీనిపై ఫిర్యాదు చేశాడు. రెండువైపులా టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే తన వద్ద రూ. 10 అదనంగా వసూలు చేశారని, మెట్రో సంస్థ నిర్లక్ష్యం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత విచారణ చేపట్టారు. విచారణలో మెట్రో సంస్థ నిర్లక్ష్యం ఉందని చెబుతూ.. లాయర్ నరేంద్ర నుంచి వసూలు చేసిన రూ.10 తిరిగి ఇవ్వడమే కాకుండా.. అసౌకర్యానికి గురి చేసినందుకు రూ.5వేలు, కోర్టు ఖర్చులకోసం మరో రూ. 5000 చెల్లించాలని బుధవారం నాడు తీర్పునిచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో స్టేషన్‌లో డిస్ప్లే బోర్డులు పెట్టాలని ఆదేశించారు.
Khammam Consumer Commission Imposed Rs.10 Thousand Fine To Hyderabad Metro