Home > తెలంగాణ > తుమ్మల కాంగ్రెస్‌లో చేరితే.. మరి పొంగులేటి పరిస్థితి

తుమ్మల కాంగ్రెస్‌లో చేరితే.. మరి పొంగులేటి పరిస్థితి

తుమ్మల కాంగ్రెస్‌లో చేరితే.. మరి పొంగులేటి పరిస్థితి
X

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్​ఎస్​ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను రేవంత్ ఆహ్వానించగా.. అభిమానులు, అనుచరగణంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సెప్టెంబర్ 6 లేదా ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.





2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) మళ్లీ పాలేరు నుంచి బరిలో దిగాలని భావించారు. 2018 ఎన్నికల్లో పాలేరులో గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. అయినప్పటికీ.. పాలేరు టికెట్ తనకే ఇవ్వాలని బీఆర్​ఎస్​ అధిష్టానాన్ని అభ్యర్థించారు. ఆగస్టు 21 న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తుమ్మలకు చోటు దక్కలేదు. దీంతో..తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల.... ఈ నెల 25న ఖమ్మం జిల్లాలో భారీ బల ప్రదర్శన చేశారు. ఆ ర్యాలీతో బీఆర్​ఎస్​- తుమ్మల మధ్య మరింత దూరం పెరిగింది. ఈ పరిణామాల నడుమ రేవంత్‌రెడ్డి స్వయంగా హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లడంతో.. రాజకీయ పయనం కాంగ్రెస్ వైపు అనేది ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. ఆయన అనుచురులు మాత్రం మళ్లీ పాలేరు నుంచే బరిలోకి దిగుతారని బలంగా చెబుతున్నారు.





గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు చెక్‌ పెటేందుకు తుమ్మలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్‌ వర్గం ప్రయత్నిస్తున్నదని తెలిసింది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తుండగా, ఆయనకిప్పుడు తుమ్మల రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. మరోవైపు, షర్మిల కనుక పార్టీలోకి వస్తే తాను ఖమ్మం నుంచైనా పోటీకి రెడీ అని తుమ్మల చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ ప్రణాళికల్లో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు, తుమ్మల, పొంగులేటి, షర్మిల పార్టీలోకి వస్తే తన పరిస్థితి ఏంటన్న అయోమయంలో సీనియర్‌ నేత రేణుకా చౌదరి గుర్రుగా ఉన్నారు.




Updated : 1 Sept 2023 10:30 AM IST
Tags:    
Next Story
Share it
Top