ఆరు గ్యారంటీల అప్లికేషన్ల పేరుతో కాంగ్రెస్ టైం పాస్ చేస్తుంది: కిషన్ రెడ్డి
X
తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీల అప్లికేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ చేస్తుందని దుయ్యబట్టారు. గురువారం (జనవరి 4) నాంపల్లి పార్టీ ఆఫీస్ లో జరిపిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న దరఖాస్తులో ఏదో మతలబ్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దరఖాస్తులతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిసినా.. కావాలనే ఆరు ప్రజాపాలన దరఖాస్తులో రేషన్ కార్డులు అడుగుతున్నారని విమర్శించారు. ఈ కారణంతో కొందరిని హామీలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టాలా? ఉద్యమకారులు అరెస్ట్ అయి.. జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. అయినా మళ్లీ ఎఫ్ఐఆర్ కాపీలు అడగడమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఉంటే.. ఎలాంటి దరఖాస్తులు లేకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.