కాంగ్రెస్ పార్టీకి, అవినీతికి విడదీయలేని బంధం ఉంది: కిషన్ రెడ్డి
X
జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇళ్లు, వ్యాపార సముదాయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.290 కోట్ల అక్రమ సంపాదనను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలో జరిగిన ఐటీ దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన దొరకడం ఇదే తొలిసారని, ఆ క్రెడిక్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవాచేశారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతల ఇంట్లో దొరికిన అక్రమ సొమ్మును లెక్కించలేక యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నారని చెప్పారు. ధీరజ్ సాహుకు సంబంధించిన 8 లాకర్లను రాంచీలో ఐటీ అధికారులు సీజ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఇదే నిదర్శనం. ధీరజ్ సాహు.. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు. ధీరజ్ సాహునే భారత్ జోడో యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐటీ దాడులపై కేంద్రాన్ని రాహుల్ విమర్శిస్తారు. ఇప్పుడు దీనిపై రాహుల్ ఎందుకు మాట్లాడట్లేదు. ఇలాంటి సన్నిహితులు రాహుల్ కు ఇంకా ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. వార్తల్లో ప్రతిరోజూ కాంగ్రెస్ నేతల కుంభకోణాలే కనిపించేవి. కాంగ్రెస్ హయాంలో 2జీ, బొగ్గు వంటి కుంభకోణాలు చాలా జరిగాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుందని, ఆ పార్టీకి, అవినీతికి విడదీయలేని బంధం ఉంటుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.