Kishan Reddy: మాయమాటలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట - కిషన్ రెడ్డి
X
మాయమాటలు చెప్పి మోసం చేయడం, చిత్తశుద్ధిలేని హామీలివ్వడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి బూటకపు హామీలతో మరోసారి ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2014, 2018, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. కాంగ్రెస్ సైతం ఇచ్చిన హామీలను ఎప్పుడూ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ చెప్పింది బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ కాదని, బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీ అని కిషన్ రెడ్డి సటైర్ వేశారు. ఫ్యామిలీ, కమీషన్, చీటింగ్ పాలసీలను మాత్రమే ఆయన బెస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సకల జనుల ద్రోహి అని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజల్ని వంచించేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయని విమర్శిచారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇట్టిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. కేంద్రం వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటే ఇంతవరకు భూమి కేటాయించని అసమర్థ ప్రభుత్వమని ఫైరయ్యారు. సెకండ్ ఫేస్ మెట్రో ఎందుకు ఆగిపోయిందో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉత్తర తెలంగాణలో మరొక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
కేసీఆర్ గులాబీ పువ్వులతో గ్రాఫిక్స్ చూపించి జీహీచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచారని కిషన్ రెడ్డి అన్నారు. 84 వేల పుస్తకాలు చదివిన తెలివితో సీఎం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూలో 80 శాతం ఆయన చేసిన అప్పుల వడ్డీలకే పోతోందని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వని సర్కారు ఇప్పుడు 90 లక్షల మందికి రూ.3000 ఇస్తానంటే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.