కేటీఆర్కు తెలివి లేదని ఈ రోజే అర్థమైంది - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X
కాంగ్రెస్పై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవడిది బానిసత్వ పార్టీ అని ప్రశ్నించారు. కేటీఆర్ అమిత్ షాని కలిసిన తర్వాత కవిత కేసు మూలనపడిందని విమర్శించారు. కేటీఆర్‌కు కొంత తెలివి ఉందని అనుకున్నానని, ఈ రోజు చిట్ చాట్ చూసిన తర్వాత ఆయనకు ఏం తెలియదని అర్థమైందని అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఆయనను బండ బూతులు తిట్టిన దానం, తలసానిని కేబినెట్ నుంచి తొలగించాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేటీఆర్ రాజకీయ అనుభవం లేని వ్యక్తి అన్న వెంకట్ రెడ్డి.. తాము ఉద్యమం చేసిన సమయంలో ఆయన అమెరికాలో ఉన్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టాడని.. వైఎస్ను ఎదిరించి తామంతా తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అంటే.. ఆమె పాత్ర ఏం లేదని ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడని మండిపడ్డారు. పార్లమెంట్‌లో కేసీఆర్ తెలంగాణ కోసం ఒక్కసారైనా మాట్లాడిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. కేబినెట్ మంత్రుల్లో చాలా మంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్లేనని.. సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియాని ఎందుకు కలిశారు..? ఎందుకు గ్రూప్ ఫోటో దిగారో చెప్పాలని వెంకట్ రెడ్డి నిలదీశారు.
కేసీఆర్ను ఫుట్ బాల్ ఆడతానని తిట్టిన వాళ్లను కేబినెట్లో పెట్టుకోవడానికి సిగ్గులేదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అవుతారన్న ఆయన.. బీఆర్ఎస్ లో మాత్రం ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్షు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండని కేటీఆర్ అమిత్ షాకి చెప్పి వచ్చాడన్న వెంకట్ రెడ్డి.. దళిత బంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.