Komatireddy Raj Gopal Reddy: కుటుంబపాలనపై పోరాడేందుకు మళ్లీ పార్టీ మారా - కోమటిరెడ్డి రాజగోపాల్
X
రాష్ట్రంలో కుటుంబపాలనకు ముగింపు పలకాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలోని ఆందోల్ మైసమ్మ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. గతంలో కేసీఆర్ కుటుంబ పాలనపై పోరాడేందుకు పార్టీ మారానని... ఇప్పుడు కూడా అదే కారణంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని అన్నారు.
తెలంగాణలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం నిలబడాలని రాజగోపాల్ ఆకాంక్షించారు. కేసీఆర్ ఒక్కరి కోసమో.. ఆయన కుటుంబం కోసమో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాలేదని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేసేందుకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న రోజే కేసీఆర్పై తన పోరాటం మొదలైందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు మునుగోడు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.