తప్పుడు నిర్ణయాలతో బీజేపీ పనైపోయింది.. కాంగ్రెస్తోనే.. : రాజగోపాల్ రెడ్డి
X
బీఆర్ఎస్ను ఓడించడం కాంగ్రెస్తోనే సాధ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్లో చేరాలని మునుగోడు ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని.. ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్లో చేరుతున్నట్లు చెప్పారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందని.. ఉపఎన్నికలో నైతిక విజయం తనదే అన్నారు. మునుగోడు నుంచే తాను ఎన్నికల బరిలో ఉంటానని.. కేసీఆర్కు దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీచేయాలని సవాల్ విసిరారు. లేదంటే తాను గజ్వేల్ నుంచి పోటీచేసి కేసీఆర్ను ఓడగొడతానని చెప్పారు.
బీజేపీ ద్వారా బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలనుకున్నాను కానీ అది సాధ్యమపడలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తప్పుడు నిర్ణయాలతో తెలంగాణలో బీజేపీ బలహీనపడిందని.. కొన్ని నిర్ణయాలపై ఎప్పటికప్పుడు హెచ్చరించినా పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో ఉందని.. రాష్ట్రంలో అవినీతిపై కేంద్రం దృష్టి సారించడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.
మునుగోడులో బీఆర్ఎస్ అధికార దుర్వినియోగంతో గెలిచిందని రాజగోపాల్ ఆరోపించారు. తాను గతంలో డబ్బుల కోసం పార్టీ మారలేదని.. ఒకవేళ డబ్బే కావాలంటే కేసీఆర్ ఎన్నోసార్లు పిలిచినా బీఆర్ఎస్ లోకి వెళ్లలేదని చెప్పారు. తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ వైపే ఉందని.. ఈ సారి హస్తం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.