Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై నమ్మకం ఉంచారు: రాజగోపాల్ రెడ్డి
X
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మునుగోడు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చేరినా సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఇచ్చింది కల్వకుంట్ల కుటుంబం కోసం కాదని, తెలంగాణ ప్రజల బాగు కోసమని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ ను గద్దె దింపే వరకు తాను విశ్రమించనని శపథం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని ప్రజలు భావిస్తున్నారు. అందుకే బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పారు.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలోని ఆందోల్ మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మరుసటి రోజే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ప్రకటించారు. దాంతో మునుగోడు నియోజక వర్గంలో అసంతృప్తి బయటపడింది. తనకు కేటాయించిన టికెట్ ను రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంపై చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాల్వాయి స్రవంతితో పాటు నియోజకవర్గంలోని ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు.