డబ్బున్న నేతలు కాంగ్రెస్లోకి వస్తే ఎలా వాడుకోవాలో తెలుసు - కోమటిరెడ్డి రాజగోపాల్
X
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు హరీశ్ రావు మాత్రమేనని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన.. హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయితేనే ఆ పార్టీ బతుకుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదని సూచించారు. ఒకవేళ కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ అయితే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా ఉండరని సెటైర్ వేశారు. కేటీఆర్ హైటెక్ పొలిటీషియన్ అన్న రాజగోపాల్.. చాలా మంది బీఆర్ఎస్ నేతలు అవమానానికి గురైనా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని అన్నారు.
అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని రాజగోపాల్ స్పష్టం చేశారు. డబ్బున్న నేతలు తమ పార్టీలోకి వస్తే ఎలా వాడుకోవాలో తమకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్లు ఎలాంటి ఢోకా లేదన్న ఆయన.. భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఆ రెండు పార్టీలు మునిగినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ ఒంటరిగా బరిలో దిగితే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 12 నుంచి 14 వరకు స్థానాల్లో విజయం సాధిస్తుందని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి టికెట్ బీసీకి ఇస్తే గెలిపించే బాధ్యత తనదని రాజగోపాల్ స్పష్టం చేశారు.