Pravalika Incident : నిరుద్యోగుల ఉసురు తగిలి ప్రభుత్వం మట్టికొట్టుకపోతది
X
గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య పై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఆమె మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చనిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతున్నా ఒక్క గ్రూప్ పరీక్ష నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో యువత ఉద్యోగాల కోసం చచ్చిపోతుండటం దారుణమని అన్నారు. నిరుద్యోగుల ఉసురు తగిలి బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుందని వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగులంతా రెండు నెలలు ఓపిక పట్టాలని వెంకట్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని అన్నారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని చేతులెత్తి కోరారు. నిరుద్యోగులంతా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బతికి సాధించాలని పిలుపునిచ్చారు.