ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజీనామా
X
భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖ అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశానని, ఈ నేపథ్యంలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. తనకు ఇంతకాలం సహకరించిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తను ఎంపీగా ఉన్న ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అధిక నిధులు తీసుకొచ్చి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
రాష్ట్రానికి హైవే వర్క్స్ సాధించడం కోసం ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి వీలైనన్నీ ప్రాజెక్టులు మంజూరు చేయాలని ఆయనను కోరినట్లు చెప్పారు. ఇక తనకు మంత్రి పదవి రావడానికి సహకరించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటానని అన్నారు.