Telangana Congress: ఇవాళ 60 మంది అభ్యర్థులను కన్ఫార్మ్ చేస్తాం : కోమటిరెడ్డి
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారాకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వాహణకు సర్వసన్నద్ధంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికలకు 4 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలోనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన జోష్తో తెలంగాణలోనూ విజయఢంకా మోగించాలని భావిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఈసారి సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. ఈ తంతు పూర్తై నెల దాటినా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయలేకపోయింది.
ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖలు చేశారు. ఇవాళ జరిగే స్క్రీనింగ్ కమిటీలో 60 - 70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌తో ఆయన భేటీ అయ్యారు. తమదిజ జాతీయ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీలా ముందే అభ్యర్థులను ప్రకటించడం సాధ్యంకాదన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులను త్వరగా ఫైనల్ చేస్తే ప్రచారం చేసుకోవడానికి వీలుంటుందని మురళీధరన్కు చెప్పినట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు.