Home > తెలంగాణ > మాటలు కోటలు దాటుతై గానీ.. పనులు గేటు దాటవు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మాటలు కోటలు దాటుతై గానీ.. పనులు గేటు దాటవు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మాటలు కోటలు దాటుతై గానీ.. పనులు గేటు దాటవు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మాటలు కోటలుదాటుతాయే తప్ప పనులు గేటు కూడా దాటవని అన్నారు. సీఎంకు బహిరంగ లేఖ రాసిన వెంకట్ రెడ్డి రైతు బంధు పైసలు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ పనితీరుకు రైతుబంధు డబ్బుల జమే నిదర్శనమని సైటర్ వేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పొలం పనులు ప్రారంభించినా అన్నదాతలకు ఇప్పటికి పూర్తి స్థాయిలో రైతుబంధు అందలేదని విమర్శించారు. లక్షలాది మంది రైతులు ఆ పైసల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

వానాకాలం సాగు ప్రారంభం కావడంతో రైతులు ముందుగా వరి నార్లు పోసినా చాలా వరకు పత్తి సాగు వైపు మళ్లారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వరి విత్తనాల కొనుగోలుకే రైతులు దాచుకున్న పైసలు అయిపోయాయని చెప్పారు. పత్తి విత్తనాల కొనుగోలుకు రైతుబంధు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారని, అయితే ఇప్పటి వరకు అన్నదాతలందరికీ రైతు బంధు నగదు అందలేదని అన్నారు.

రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టుకోవడం కాదు.. రైతుబంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారో చెప్పండని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. రైతు సంఘాల ద్వారా తనకు మరో విషయం తెలిసిందన్న ఆయన.. రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినా వాటిని తీసేందుకు వీల్లేకుండా అకౌంట్‌‌లను హోల్డ్‌‌లో పెడుతున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీల మీద వడ్డీలు పెరిగి అన్నదాతల అప్పులు రెట్టింపయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన మోసంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే హోల్డ్‌లో పెట్టిన అకౌంట్స్‌ను వెంటనే తిరిగి ప్రారంభించి వారికి నగదు అందేలా చూడాలని వెంకట్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు.

Updated : 20 July 2023 3:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top