Komatireddy Venkata Reddy: రేవంత్ సీఎం క్యాండిడేట్ కాదు.. అసలు కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులే లేరు: కోమటిరెడ్డి
X
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో మాటల యుద్ధం మళ్లీ మొదలయింది. ఇటీవల తాండూరు వేదికగా జరిగిన కాంగ్రెస్ సభలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. సభలో ఆయన మాటలను తప్పుగా అనువధించిన రామ్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పుకొచ్చారు. దాంతో కాంగ్రెస్ లో మళ్లీ దుమారం మొదలయింది. రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
రామ్మోహన్ వ్యాఖ్యలను తాను పరిగణనలోకి తీసుకోనని చెప్పుకొచ్చారు. ఒకవేళ డీకే శివకుమార్ ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని, పార్టీలో ఉన్న ప్రతీ ఎమ్మెల్యే ఒక సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరిని చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. ఈ విషయాలేవీ పార్టీ నేతలు పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం తమ లక్ష్యం ఎన్నికల్లో గెలవడమేనని కోమటిరెడ్డి చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టిస్తుందని, కచ్చితంగా 80 స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.