సోనియా గాంధీ అనుకుంటే నేను సీఎం అవడం ఎంతసేపు: కోమటిరెడ్డి
X
కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోసారి సీఎం పదవిపై తన అక్కసును వెళ్లగక్కారు. అధికారంలోకి రాగానే సీఎం సీటెక్కుతానని, సోనియా గాంధీ అనుకుంటే తాను సీఎం అవడం ఎంతసేపని చెప్పుకొచ్చారు. సోమవారం (నవంబర్ 13) నల్గొండలోని కంచనపల్లి, దీపకుంట, రాములబండ, దోమలపల్లి, నర్సింగ్ భట్ల, పాతూరు, చెన్నూగూడెం, దొనకల్లు, గుండ్లపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి ప్రజలతో ఈ వ్యాఖలు చేశారు. నెల రోజుల్లో కేసీఆర్ నియంత పాలన పోయి ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని, ఉద్యమకారులకు అన్యాయం చేసి, ఉద్యమ ద్రోహులంతా పంచన చేర్చుకున్నారని ఆరోపించారు.
ఉద్యోగ భర్తీలేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామని, 100 రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాలను పంచుతామని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట అవాస్తమని, సబ్ స్టేషన్స్ లో లాగ్ బుక్ చూస్తే అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసింది తప్ప.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండకు చేసింది ఏమీలేదని అన్నారు.