Korutla Deepthi Sister : అక్కను నేనెందుకు చంపుతానురా.. ప్లీజ్ నన్ను నమ్ము.. ఆడియో వైరల్..
X
జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో కీలక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. దీప్తి మృతి తర్వాత ఆమె చెల్లి చందన ఓ యువకుడితో వెళ్లిపోయింది. అయితే ఆమె తన సోదరుడు సాయికి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. అక్కను తాను చంపలేదని.. అసలేం ఏం జరిగిందో తనకు తెలియదని ఆ ఆడియోలో ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆడియోలో ఏముందంటే.. ‘‘అరేయ్ సాయి నేను చందక్కను రా.. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత అవి తెప్పించా. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తాగిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం అన్నా. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నా. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. పిలిచినా లేవలేదు. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు. అక్కను నేనెందుకు చంపుతా. నన్ను నమ్మురా’’ అంటూ తన సోదరుడితో చెప్పింది.
మరోవైపు పోలీసుల విచారణ కొనసాగుతోంది. దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎడమ చేయి కూడా విరిగిపోయి ఉండడంతో ఇదే హత్యేననే అనుమానిస్తున్నారు. చెల్లి చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగిందా.. ఒకవేళ ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందనా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.