ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా
X
మెదక్ ఎంపీ పదవికి బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. బుధవారం ఢిల్లీలో స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిసి ప్రభాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన బావోద్వేగానికి గురయ్యారు. గత పదేళ్లుగా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా పలు అభివృద్ధి పనులు చేశానని, ఈ మేరకు తాను పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజీనామా అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు కొత్త ప్రభాకర్ర రెడ్డి. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని చేగుంట నుండి మెదక్ రోడ్డు వరకు LC నెం.228వద్ద RoB నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరారు. కాగా గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు.అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో దుబ్బాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత రఘునందన్ రావు ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.