25రోజుల్లో నోటిఫికేషన్.. అసెంబ్లీ ఎన్నికలపై వనమా ఏమన్నారంటే..?
X
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. మరి కొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండగా.. కేసీఆర్కు షాకివ్వాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 25 రోజుల్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అన్నారు.
కొత్తగూడెంలో తానే పోటీచేయనున్నట్లు వనమా చెప్పారు. ‘‘ఇటీవల సీఎం కేసీఆర్ నన్ను లంచ్కు పిలిచారు. కొత్తగూడెం నుంచి మళ్లీ నన్నే పోటీ చేయాలని చెప్పారు. నేను అడిగిన అన్ని పనులకు ఒకే అన్నారు. నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి’’ అని వనమా అన్నారు. ప్రస్తుతం వనమా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కాగా వనమాపై హైకోర్టు ఇటీవలే అనర్హత వేటు వేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించినందుకు కోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు రూ.5 లక్షల ఫైన్ విధించింది. ఈ తీర్పును ఆయన సుప్రీంలో సవాల్ చేయగా.. అక్కడ రిలీఫ్ దక్కింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆయన మళ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే కొత్తగూడెం టికెట్ కోసం బీఆర్ఎస్లో చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఈ సారి వనమాకు టికెట్ కష్టమే అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.